వార్తలు

కృష్ణానదిలో పోటెత్తిన వరద.. సాగర్ 26 గేట్లు ఖుల్లా

నల్గొండ జిల్లా: కృష్ణా నదిలో వరద పోటెత్తిపోతోంది. ఎగువన నది పరివాహక ప్రాంతాల నుండి వస్తున్న వరదకు తోడు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు చరిత్రలోనే తొలిసారిగా గేట్లన్నీ పూర్తి స్థాయిలో ఎత్తివేసి దిగువకు నీటి విడుదల చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. నాగార్జునసాగర్ డ్యామ్ కు ఉన్న 26 క్రస్ట్ గేట్లన్నీ ఎత్తి నీటి విడుదల చేయడం ఇవాళ రెండో రోజు.

ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు భారీ వరద వస్తోంది. ఇవాళ ఉదయం 8 గంటల సమయానికి అందిన వార్తల ప్రకారం నాగార్జునసాగర్ కు 4 లక్షల 14వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో గేట్లన్నీ ఎత్తేసి 4 లక్షల 22 వేల 292 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ డ్యామ్ పూర్తిస్దాయి నీటి మట్టం 590 అడుగులు కాగా .. 587.50అడుగుల నీటిమట్టం కొనసాగిస్తున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ: 312 టీఎంసీలు కాగా.. 305.8030 టీఎంసీల నీటి నిల్వ కొనసాగిస్తూ.. నీటి విడుదల కొనసాగిస్తున్నారు. కృష్ణా నదిలో వరద పరవళ్లు తొక్కుతున్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

What's your reaction?

Leave A Reply

Your email address will not be published.