వార్తలు

తప్పతాగిన సెక్యూరిటీ గార్డు వీరంగం.. లేడీస్‌ హాస్టల్‌లో

ఢిల్లీ: మరో షాకింగ్‌ ఘటన సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. తాగిన మత్తులో లేడీస్‌ హాస్టల్‌లోకి జొరబడి.. ఓ యువతిపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు అదే హాస్టల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు.

ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజీలో రికార్డుకాగా.. విషయం బయలకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఢిల్లీ కరోల్‌ బాగ్‌ ఏరియాలో ఉన్న ఓ లేడీ హాస్టల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్‌ కారిడార్‌లోంచి వెళ్తున్న యువతులు.. మద్యం మత్తులో లోపలికి వచ్చిన సెక్యూరిటీ గార్డును చూసి ఒక్కసారిగా వెనక్కి పరుగులు తీశారు. ఇంతలో ఓ యువతిని దొరకబుచ్చుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడికి సైతం పాల్పడ్డాడు సెక్యూరిటీ గార్డు.

ఈ ఘటనపై హాస్టల్‌ ఓనర్‌ ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజీ ద్వారా ఢిల్లీ ఉమెన్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ దృష్టికి చేరడంతో ఆమె ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో డీసీడబ్ల్యూ రంగంలోకి దిగి.. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. నిందితుడిని అరెస్ట్‌ చేయాలని స్వాతి మలివాల్‌, ఢిల్లీ పోలీసులకు కోరారు. అంతేకాదు గురువారం సాయంత్రం కల్లా ఘటనపై పూర్తి నివేదికను అందించాలని గడువు విధించారు.

అయితే బాధితురాలు ఫిర్యాదుకు ముందుకు రాకపోవడంతో.. న్యాయ సలహా మేరకు వీడియో ఆధారంతో ఈ ఘటనను సుమోటాగా స్వీకరించామని, ఎఫ్ఐఆర్‌ నమోదు చేశామని ఢిల్లీ సెంట్రల్‌ డిస్ట్రిక్‌ డీసీపీ శ్వేతా చౌహాన్‌ వెల్లడించారు.

What's your reaction?

Leave A Reply

Your email address will not be published.