ఎంటర్టైన్‌మెంట్మూవీ రివ్యూస్

రంగ రంగ వైభ‌వంగా మూవీ రివ్యూ & రేటింగ్‌

నటీనటులు: వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ, నవీన్ చంద్ర, సీనియర్ నరేష్, ప్రభు, ప్రగతి, తులసి తదితరులు
దర్శకత్వం : గిరీశాయ
నిర్మాతలు: BVSN ప్రసాద్
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుదీన్


రేటింగ్: 2.5/5

తొలి సినిమాకే హిట్టు కొట్టిన వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే… అది అదృష్ట‌మా?  లేదంటే… ప్ర‌తిభ‌నా అనేది తెలియాలంటే ఇంకో రెండు మూడు సినిమాల వ‌ర‌కూ ఎదురు చూడాల్సిందే. తొలి సినిమా హిట్ట‌యితే రెండో సినిమాపై అంచ‌నాలు పెరుగుతాయి. అక్క‌డ్నుంచి అస‌లు క‌ష్టాలు మొద‌ల‌వుతాయి. అంచ‌నాల్ని అందుకోలేక‌పోతే… తొలి విజ‌యం కూడా గాలివాటంగానే వ‌చ్చింద‌ని జ‌నాలు అనుకొనే ప్ర‌మాదం ఉంది. `ఉప్పెన‌`తో క‌నీ వినీ ఎరుగ‌ని విజ‌యాన్ని సొంతం చేసుకొన్నాడు వైష్ణ‌వ్ తేజ్‌. అయితే ఆ త‌ర‌వాత వ‌చ్చిన `కొండ‌పొలం` ఫ్లాప్ అయ్యింది. ఈసారి క‌చ్చితంగా హిట్టు కొట్టాల్సిన అవ‌స‌రం వైష్ణ‌వ్ కి ఉంది. త‌న నుంచి వ‌చ్చిన మూడో సినిమా `రంగ రంగ వైభ‌వంగా`. మ‌రి ఈసారి వైష్ణ‌వ్ ఏం చేశాడు?  త‌న‌పై ఏర్ప‌డిన అంచ‌నాల్ని నిజం చేసుకొన్నాడా, లేదా?  ఇంత‌కీ ఈ సినిమా క‌థేమిటి?  దాని క‌థాక‌మామిషూ ఏమిటి?


* క‌థ‌


రిషి (వైష్ణ‌వ్ తేజ్‌), రాధ (కేతిక శ‌ర్మ‌) ఇద్ద‌రూ ఒకే రోజు, ఓకే స‌మ‌యంలో పుట్టారు. చిన్న‌ప్ప‌టి నుంచీ మంచి ఫ్రెండ్స్‌. రెండు కుటుంబాల మ‌ధ్య కూడా అంతే అనుబంధం ఉంటుంది. రాధ‌పై రిషి ఈగ కూడా వాల‌నివ్వ‌డు. ఇంత మంచి స్నేహితులు చిన్న గొడ‌వ‌తో విడిపోతారు. `ముందు నువ్వొచ్చి సారీ చెప్పేంత వ‌ర‌కూ నేను నీతో మాట్లాడ‌ను` అనే ఈగోతో దాదాపు ప‌దేళ్లు మాట్లాడుకోరు. కాక‌పోతే.. ఒక‌రంటే మ‌రొక‌రికి కేరింగ్, ప్రేమ‌. మ‌న‌సులో ఉన్న ప్రేమ‌ని, ఇష్టాన్నీ బ‌య‌ట పెట్టుకోరంతే. మ‌రి.. ఇద్ద‌రి మ‌ధ్యా ఈగోల అడ్డుగోడ ఎప్పుడు బ‌ద్ద‌లైంది..?  ఈ రెండు కుటుంబాల మ‌ధ్య ఉన్న స్నేహం వైరంగా ఎప్పుడు మారింది?  
అనేది తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.


* విశ్లేష‌ణ‌


నిజానికి చాలా చాలా రొటీన్ స్టోరీ ఇది. ఇలాంటి క‌థ‌… లైన్ గా చెప్పిన‌ప్పుడే `చాలాసార్లు చూసేశాం క‌దా` అనే భావ‌న క‌లుగుతుంది. దాన్ని పేప‌ర్ పై పెట్టాలంటే మాత్రం కొత్త త‌ర‌హా సీన్లు రాసుకోవాలి. బ‌హుశా.. ద‌ర్శ‌కుడు గిరీశాయ కూడా ఈ క‌థ‌నికొత్త‌గా చెబుతాడ‌న్న న‌మ్మ‌కంతోనే ఆ బాధ్య‌త అప్ప‌గించి ఉండొచ్చు. ఓపెనింగ్ సీన్ ద‌గ్గ‌ర్నుంచి చివ‌రి వ‌ర‌కూ సీన్ల‌న్నీ వ‌చ్చిపోతుంటాయి త‌ప్ప‌.. ఎక్క‌డా `ఇది కొత్త సీన్‌` అనిపించ‌దు. ఏ ముక్క‌కి ఆ ముక్క ఓకే అనిపిస్తుంది కానీ, వాట‌న్నింటినీ జాయింటుగా చూసిన‌ప్పుడు మాత్రం ఎలాంటి ఫ్రెష్ ఫీలింగ్ క‌ల‌గ‌దు. అస‌లు బేసిక్ లైనే చాలా పాత‌ది.


`నిన్నే పెళ్లాడ‌తా` రిలీజ్ రోజున‌.. అంటే ఓపెనింగ్ కార్డ్ పై ప‌డుతుంది. ఆ సినిమా ప్ర‌భావం `రంగ రంగ‌..`పై చాలా ఉంద‌న్న‌ది ఆ త‌ర‌వాత మెల్ల‌గా అర్థ‌మ‌వుతుంది. హీరో, హీరోయిన్ల మ‌ధ్య ఈగో క్లాష్, దానికి గ‌ల కార‌ణం, ఇద్ద‌రూ క‌లిసిపోవ‌డం.. ఇవన్నీ ఫోర్డ్స్ గా అనిపిస్తాయి త‌ప్ప‌, క‌థ‌లోంచి పుట్టుకొచ్చిన‌ట్టుగా ఉండ‌వు. కాక‌పోతే.. ఆయా సీన్లు కాస్త యూత్ ఫుల్ గా రాసుకోవ‌డం కాస్త క‌లిసొచ్చే విష‌యం. హీరో – హీరోయిన్ల కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ అవ్వ‌డం, పాట‌లు బాగుండ‌డం, తెర నిండా తెలిసున్న న‌టీన‌టులు క‌నిపించ‌డంతో.. ఫ‌స్టాఫ్ ఓకే అనిపిస్తుంది.


అయితే ద్వితీయార్థం నుంచి అస‌లు స‌మ‌స్య మొద‌ల‌వుతుంది. కేవ‌లం సినిమాని రెండు గంట‌ల పాటు న‌డిపించ‌డానికి ఆ స‌న్నివేశాలు అల్లుకొన్న‌ట్టు కనిపిస్తుంది త‌ప్ప‌.. వాటి వ‌ల్ల క‌థ‌కు వ‌న‌గూరే ప్ర‌యోజ‌నం ఏమీ క‌నిపించ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు..  అర‌కులో డాక్ట‌ర్ల కాంపెనియింగ్ కేవ‌లం పావు గంట కాల‌క్షేపం కోసం తీసిన ఎపిసోడ్‌. స‌త్య‌తో తాగుబోతు సీను కూడా శ్రీ‌నువైట్ల గ‌త చిత్రాల ఛాయ‌లో సాగుతుంది. క‌థ‌లో సంఘ‌ర్ష‌ణ బ‌లంగా లేదు. రామ్‌, చంటి (ప్ర‌భు, న‌రేష్‌)ల‌ను అంత గొప్ప స్నేహితులు, ఇంత గొప్ప స్నేహితులు  అని చెప్ప‌డం మిన‌హా.. తెర‌పై వాళ్ల స్నేహం ఎంత గొప్ప‌దో చూపించ‌లేదు.


ఇంట్లో పిల్ల‌లు కొట్టుకుంటూ, త‌మ స్నేహానికి అడ్డు చెబితే.. అస్స‌లు ఇద్ద‌రూ ఒక్క మాట కూడా మాట్లాడ‌రు. చివ‌ర్లో రాముడు చెప్పిన డైలాగులు కూడా కృత‌కంగా ఉంటాయి. చాలా సీన్లు `నవ్వే కావాలి`, `ఖుషి`,`నిన్నే పెళ్లాడ‌తా` సినిమాల్ని గుర్తుకు తెస్తాయి. న‌వీన్ చంద్ర పాత్ర కూడా ద‌ర్శ‌కుడు త‌న క‌థ‌కు ఎలా కావాలో అలా మ‌ల‌చుకుంటూ వెళ్లిపోయాడు. న‌వీన్ చంద్ర‌లో వ‌చ్చిన మార్పు కూడా చాలా కృత‌కంగా అనిపిస్తుంటుంది. పాట‌లు బాగున్నా – హుషారు తెప్పించేది ఒక్క పాట కూడా లేదు. ఫైటు ఉన్నా ఇంపాక్ట్ క‌లిగించ‌లేదు.


* న‌టీన‌టులు


వైష్ణ‌వ్ తొలి సినిమాతోనే ఆక‌ట్టుకొన్నాడు. కొండ పొలెం ఫ్లాఫ్ అయినా ఎమోష‌న్స్ బాగానే ప‌లికించాడు. ఈ సినిమా విష‌యంలోనూ త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. త‌న కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి. కేతిక హోమ్లీగా  ఉంది. రొమాంటిక్ పాట‌లో గ్లామ‌ర్ ప‌లికింది. న‌రేష్‌, ప్ర‌భు లాంటి సినియ‌ర్ న‌టుల్ని పెట్టుకొనికూడా వాళ్ల పాత్ర‌ల్ని స‌రిగా వాడుకోలేదు. న‌వీన్ చంద్ర బాగానే న‌టించాడు. కాక‌పోతే ఆ పాత్ర‌ని డిజైన్ చేయ‌డంలోనే లోపం ఉంది.


* సాంకేతిక వ‌ర్గం


పాట‌ల‌కు పాస్ మార్కులు ప‌డ‌తాయంతే. ఒక‌ట్రెండు పాట‌లు ఎక్క‌డో విన్న‌ట్టుంటాయి. దేవీ ఆల్బ‌మ్ లో క‌నిపించే ఊపు ఈ సినిమాలో లేదు. నేప‌థ్య సంగీతంలోనూ అంతే. గిరీశాయ చాలా రొటీన్ క‌థ‌ని చాలా రొటీన్ ప‌ద్ధ‌తిలో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాడు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. కాస్టింగ్ అదిరింది. అయితే… రాత‌లో తీత‌లో పాత వాస‌న గుప్పుమ‌ని కొట్టింది.


ప్ల‌స్ పాయింట్స్


హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ
నిర్మాణ విలువ‌లు
ఒక‌ట్రెండు పాట‌లు


మైన‌స్ పాయింట్స్‌


పాత క‌థ‌
కొత్త‌ద‌నం లేని క‌థ‌నం
సంఘ‌ర్ష‌ణ లేక‌పోవ‌డం

What's your reaction?

Leave A Reply

Your email address will not be published.